నెల్లూరు: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బుధవారం ఫ్యాక్స్‌ ద్వారా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపారు. 

గత పన్నెండేళ్లుగా టీడీపీని నమ్ముకొనే ఉన్నానని, గత ఎన్నికల్లో చివరి వరకు తనకే టికెట్‌ ఇస్తారని ఆశించానని అయితే ఆకస్మాత్తుగా పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. 

పోలంరెడ్డికి గెలుపుకు కృషి చేయమంటే చేశానని రాజీనామాలో పేర్కొన్నారు. ఆ సమయంలో వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకోకపోవడంతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.  

కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేమని చెప్పారని, తర్వాత ఎంపీ టికెట్‌ ఇచ్చేందుకు తన పేరును పరిశీలించారని, తర్వాత అది కూడా ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురయ్యానని తెలిపారు. 

పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విధివిధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని తనను క్షమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే పెళ్లకూరు శ్రీనివాసుల రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది.