చింతలపూడి: అధికార తెలుగుదేశం పార్టీకి అసమ్మతి వెంటాడుతూనే ఉంది. టికెట్ దక్కకపోవడంతో అలకబూనిన నేతలు ఇంకా దిగి రావడం లేదు. ఇప్పటికే టికెట్ దక్కనివారు కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మరికొందరు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్న పరిస్థతి. 

మరికొందరైతే పార్టీలోనే ఉంటూ మౌనంగా ఉంటున్నారు. అదేకోవలో చేరిపోయారు మాజీమంత్రి పీతల సుజాత. పీతల సుజాతకు చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె అలకబూనారు. వారం రోజులుగా పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 

అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆసభకు పీతల సుజాత డుమ్మా కొట్టారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో అలకబూనిన ఆమె చంద్రబాబు నాయుడు మీటింగ్ కు సైతం గైర్హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. 

ఇకపోతే 2014 ఎన్నికల్లో పీతల సుజాత చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం తొలికేబినేట్ లో ఆమె మంత్రి పదవిని దక్కించుకున్నారు. కీలకమైన మైనింగ్ శాఖకు మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. కేబినేట్ విస్తరణలో ఆమెకు ఉద్వాసన పలికారు చంద్రబాబు నాయుడు. 

గతంలో మంత్రిపదవి పీకేసిన చంద్రబాబు నాయుడు ఈసారి ఏకంగా టికెట్ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరిస్తారా లేక పార్టీ మారతారా అన్నది వేచి చూడాలి.