భీమవరం: భీమవరం నుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తాను భీమవరం నుంచి పోటీ చేస్తానన్న ఆందోళన నేపధ్యంలోనే భీమవరంలో నామినేషన్ వేయకుండా కుట్రలు చేశారని ఆరోపించారు. 

నరసాపురం ఎంపీగా నామినేషన్ వేసిన కేఏ పాల్.. అటునుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు భీమవరంకి వచ్చారు. అయితే నామినేషన్ల స్వీకరణకు సమయం ముగియడంతో అధికారులు ఆయన నామినేషన్‌ను స్వీకరించలేదు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన పాల్ తాట తీస్తా అంటూ విరుచుకుపడ్డారు. భీమవరంలో తన నామినేషన్‌ను తిరస్కరించారని ఈ రోజు‌ను బ్లాక్ డే గా అభివర్ణిస్తున్నట్లు ప్రకటించారు. తనను అడ్డుకునేందుకు చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌లు కుట్ర పన్నారని ఆరోపించారు.  

భీమవరంలో అడ్డుకున్నా నరసాపురంలో అడ్డుకోలేరని స్పష్టం చేశారు. నరసాపురంలో గెలిచి తానేంటో చూపిస్తానని హెచ్చరించారు. ఏడాదిలో నరసాపురాన్ని నార్త్‌ అమెరికా చేస్తానని ప్రకటించారు. 175 నియోజకవర్గాలకు గానూ 80 మంది అభ్యర్థుల్నే ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు కేఏ పాల్.