విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఖరారయ్యాయి. ఆయన రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన పోటీ చేసే స్థానాలను పార్టీ మంగళవారంనాడు అధికారికంగా ప్రకటించింది.

విశాఖపట్నం జిల్లాలోని గాజువాక నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఆయన గాజువాక నుంచి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా సాగినప్పటికీ రెండో స్థానం విషయంలో స్పష్టత రాలేదు.

పవన్ కల్యాణ్ తిరుపతి నుంచి కూడా పోటీ చేయవచ్చుననే ప్రచారం సాగింది. అయితే, ఆయన భీమవరం స్థానాన్ని ఎంచుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. 

పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానాలపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం ఓ ప్రకటన విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే పార్టీకి ఉపయుక్తంగా ఉంటుందో తెలుసుకోవడానికి జనరల్ బాడీ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించిందని ఆయన తెలిపారు. 

అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం స్థానాలు అగ్రస్థానంలో నిలిచాయని ఆయన చెప్పారు. ఈ ఎనిమిది స్థానాలపై అంతర్గత సర్వే జరిపించిన జనరల్ బాడీలోని మేధావులు, విద్యావేత్తులు, ఇతర రంగాల నిపుణులు భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేయాల్సిందా పవన్ కల్యాణ్ ను కోరారని ఆయన వివరించారు. నామినేషన్ వేసే తేదీని ఈ రోజు సాయంత్రం లేదా రేపు తెలియజేస్తారు.