విజయవాడ: ఓటు తొలగింపు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్  కు చేదు అనుభవం ఎదురైంది. తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, ఓ చోట తొలగించాలని ఆయన సంబంధిత అధికారులతో చెప్పినట్లు సమాచారం. 

ఏలూరులో తనకు ఉన్న ఓటును విజయవాడ తూర్పునకు మార్చాలని పవన్ కల్యాణ్ కోరినట్లు సమాచారం. అయితే సర్వర్ పనిచేయడం లేదని, అందువల్ల అది సాధ్యం కాదని కలెక్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడికే ఇటువంటి అనుభవం ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై పవన్ కల్యాణ్ శనివారం జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. రేపు ఆదివారంనాడుసీట్ల సర్దుబాటు కొలిక్కి రాగలదని భావిస్తున్నారు. 

తెలంగాణలో కూడా పవన్ కల్యాణ్ తన పార్టీని పోటీకి దించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో లోకసభకు పోటీ చేయడానికి సిద్ధపడేవారు దరఖాస్తులు పెట్టుకోవాల్సిందిగా ఆయన సూచించారు. హైదరాబాదులోని మాదాపూర్ కార్యాలయంలో మూడు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది.