రాజమండ్రిలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు. కొన్ని దశాబ్ధాల క్రితం నా తండ్రి చెప్పిన మాటలు గుండె ధైర్యాన్ని ఇచ్చాయన్నారు.

అదే ధైర్యం కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడిని చేసిందని పవన్ అన్నారు. అదే ధైర్యం దశాబ్ధాల అనుభవమున్న ప్రతీ ఒక్కరు భయపడుతుంటే ఎదిరించి 2014 మార్చిలో జనసేన పార్టీని ప్రకటించిందన్నారు.

అదే ధైర్యం రాష్ట్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పిందన్నారు. అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి నిర్ణయించుకుందన్నారు. అదే ధైర్యం 2019లో ఒక కానిస్టేబుల్ కొడుకును ముఖ్యమంత్రిగా చేస్తుందని పవన్ కల్యాణ్ ఉద్వేగంగా చేశారు.

సీఎం పదవిపై తనకు ఆశ లేదని, తాను ఒక సామాన్యుడినని, ఒక చిన్నపాటి జీవితం ఉంటే చాలనుకున్న వాడినన్నారు. అవినీతి, ఆడపడుచులపై అత్యాచారాలు చూసిన నాకు ఒక ధైర్యాన్ని నింపాయన్నారు.

ఇంట్లో సుఖం, నా స్వార్థం నేను చూసుకోనా అన్న దశలో యుద్ధం చేయని మనసు చెప్పిందని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. పుస్తకాల్లో చెప్పిన దేశానికి, విలువలకు చాలా దూరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి పదవిపై తనకు కోరిక లేదని, కానీ ప్రజలకు న్యాయం జరగాలి అంటే సీఎం పదవి అనేది ఒక బాధ్యత అన్నారు. పవర్‌స్టార్ అన్న పదమే తనకు ఎక్కలేదని ముఖ్యమంత్రి పదవి అస్సలు ఎక్కదని కల్యాణ్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావాలని 2003లోనే అనుకున్నట్లు పవన్ వెల్లడించారు.