ఏపీలో ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సర్వత్రా పోలింగ్ ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. విజయం మాదంటే మాది అంటూ.. ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు 120సీట్లు, 130 సీట్లు వస్తాయని మీడియా సమావేశాల్లో చెప్పుకుంటున్నారు.  జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా తమ పార్టీకి 88సీట్లు వస్తాయని... గెలుపు తమదేనని పేర్కొన్నారు. కాగా.. తాజాగా ఈ సీట్ల లెక్కపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆదివారం పవన్ కళ్యాణ్... మంగళగిరిలో తమ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ ఇది మనం ఎదిగే దశ. మార్పు చిన్నగానే మొదలౌతుంది. ఈ మార్పు ఎంత వరకు వెళ్తుందో తెలియదు. ఎన్నికలు పూర్తయిన వెంటనే టీడీపీ, వైసీపీలు తమకు ఇన్ని స్థానాలు వస్తాయంటూ లెక్కలు వేసుకుంటారు. మనం అలా లెక్కలు వేయం. మనకు లెక్కలతో సంబంధం లేదు. ఓటింగ్ సరళి ఎలా జరిగిందో తెలుసుకోండి చాలు.’’ అని పేర్కొన్నారు.

కాగా.. పవన్ ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి ఆ పార్టీ అభ్యర్థులు కేవలం 15మంది రావడం విశేషం. పోలింగ్ తర్వాత తమకు ఎదురైన అనుభవాలను పవన్.. అభ్యర్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు.