జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్  చేశారు.  ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన.. ఏపీలోని ప్రతిపక్ష పార్టీ వైసీపీ, తెలంగాణలోని అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపించారు.

శుక్రవారం మీడియా సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ఇటీవల కొందరు నేతలు తమ జనసేన పార్టీలో చేరదామని వచ్చి మరీ.. తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారని  చెప్పారు. ఇలా ఎందుకు చేశారని ఆరా తీస్తే.. కారణం కేసీఆర్ అని తేలిందని పవన్ అన్నారు. ఆ నేతలందరికీ హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయని...వాటితో తమకు సమస్యలు ఉన్నాయని అందుకే వైసీపీలోకి వెళ్తున్నామని ఆ నేతలు తనకు చెప్పారన్నారు.

ప్రస్తుతం జరుగుతుంది చూస్తుంటే తనకు పూర్తిగా అన్నీ అర్థమౌతున్నాయని పవన్ అన్నారు.ఓట్లు వేసేముందు ప్రజలు అన్ని విషయాలు ఆలోచించాలని, ఎవరి హయాంలో మేలు జరిగిందో.. ఎవరి హయాంలో అవినీతి, ఘోరాలు జరిగాయో బేరీజు వేసుకొని ఓటు వేయాలని పవన్‌ సూచించారు.
 
జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్‌ వివేకా హత్యను ఎందుకు దాచిపెట్టారని పవన్‌ ప్రశ్నించారు. ఇంట్లో మనిషిని హత్య చేస్తే ఎందుకు అంత గోప్యత పాటించారని నిలదీశారు. కోడికత్తి ఘటనపై హడావుడి చేసిన జగన్‌.. వివేకా హత్యపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. హత్యా రాజకీయాలు చేసేవారు అధికారంలోకి వస్తే.. రాష్ట్రం ఏమవుతుందోనని భయమేస్తోందని పవన్‌ అన్నారు.