విజయవాడ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ పోటీ చెయ్యకపోవడం వెనుక టీడీపీ నుంచి తీసుకున్న ప్యాకేజీయే కారణమంటూ ఆరోపించారు. 

టీడీపీ ప్యాకేజీ తీసుకొని మంత్రి నారా లోకేష్‌పై పోటీ చెయ్యకుండా మంగళగిరి సీటును సీపీఐకి కేటాయించారని ఆరోపించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చినా తెలుగుదేశం పార్టీ పోలీస్‌ వ్యవస్థను దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. 

గతంలో కూడా పవన్‌ కళ్యాణ్‌ను టీడీపీ మేనేజ్‌ చేసిందని, భూములు తీసుకుంటే ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్‌ ఏమి చేయలేకపోయారని తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన మంగళగిరిలో సర్వేల పేరిట కోడ్‌ ఉల్లంఘన జరుగుతోందన్నారు. 

తెలంగాణకు చెందిన కొంతమంది విద్యార్థులతో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సర్వేలు చేయిస్తున్నారని వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. అధికారపార్టీ ఆగడాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్కే స్పష్టం చేశారు. 

మంగళగిరిలో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతుందన్నారు. చంద్రబాబు అక్రమ మార్గాల ద్వారా కొడుకుని గెలిపించుకోవాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కోడ్‌ను ఉల్లంఘిస్తూ సెల్‌ఫోన్లు పంచుతున్నారని ఆరోపించారు. వార్డు స్థాయి నేతలకు కొత్తబైకులు పంచుతున్నారన్నాని చెప్పుకొచ్చారు. 

మంగళగిరిలో లోకేష్‌కు బదులు చంద్రబాబు పోటీచేయాలని సవాల్‌ విసిరారు. మరోవైపు మనిషి చనిపోతే పరవశించి పోయే నాయకుడు లోకేష్ అనిని విమర్శించారు. పారదర్శకంగా ఉండాల్సిన పోలీసులు ఒకే పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించారు. 

తెలంగాణలో డీజీపీ ఆర్.పి.ఠాకూర్ పార్కు అక్రమించారని తాను కోర్టుకు వెళ్లానని ఆనాటి నుంచి ఆయన తనపై కక్ష కట్టారని తెలిపారు. ఇంటిలిజెన్స్ అధికారి ఏవీ వెంకటేశ్వరరావు  టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. భూములు కాజేసేందుకే మంగళగిరికి లోకేష్‌ వచ్చారని చెప్పుకొచ్చారు. అప్రజాస్వామికంగా కుల ప్రాతిపాదికన ఓట్లు చేర్చారని ఎమ్మెల్యే ఆర్కే ధ్వజమెత్తారు.