విశాఖపట్నం: గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం విశాఖ నగరపాలక సంస్థ జోన్‌-5 కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు జనసేనాని. 

పవన్ కళ్యాణ్ నామినేసన్ సందర్భంగా జోన్ 5 కార్యాలయానికి భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోపలికి వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, అభిమానులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. 

అయినప్పటికీ కార్యకర్తలు వెళ్లకపోవడంతో పోలీసులు చెదరగొట్టారు. నామినేషన్ దాఖలు చేసిన పవన్ కళ్యాణ్ అనంతరం అక్కడ నుంచి కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లిపోయారు. 

అనంతరం గాజువాక, భీమునిపట్నం, విశాఖ సౌత్ నియోజకవర్గాల్లో జరగబోయే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు బయలు దేరారు పవన్ కళ్యాణ్. ఇకపోతే శుక్రవారం మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 5 గంటలలోపు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చెయ్యనున్నారు పవన్ కళ్యాణ్.