ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తాను టీడీపీ పార్ట్నర్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని పవన్ తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ తల తెగిపడినా జగన్‌లా మోదీ, అమిత్‌షాల ముందు మోకరిల్లబోమని స్పష్టం చేశారు. 

యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అని జగన్‌ పిలిస్తున్నాడని మరి జైలులో ఉండి వచ్చిన జగన్ ను ఏమని పిలవాలని ప్రశ్నించారు. 

రాష్ట్రానికి  ప్రత్యేక హోదా, ప్రకాశం జిల్లాకు వెనుకబడిన నిధులు ఇవ్వని కేంద్రం వద్ద తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్, బీజేపీలతో పొత్తులపై వైసీపీ బహిరంగంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.