యువతకు 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వడానికి నా కెరీర్‌ను వదులుకున్నానన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజమండ్రిలో జరుగుతున్న ఆ పార్టీ ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు.

పోరాటయాత్రను మొదలుపెట్టినప్పుడు అభిమానులు, కార్యకర్తలు నమ్మారని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. సినిమాలు ఆపేసి చంద్రబాబును అడిగి మంచి కాంట్రాక్టు తీసుకోమని సలహాలు ఇచ్చినట్లు జనసేనాని తెలిపారు.

అయితే అలాంటి తుచ్చమైన పనులు పవన్ కల్యాణ్ చేయడని మరొకరి దగ్గరికి వెళ్లాలని చెప్పినట్లు వెల్లడించారు. చంద్రబాబు, జగన్‌లతో తనకు ఎటువంటి విభేదాలు లేవని పవన్ స్పష్టం చేశారు.

అయితే వాళ్ల విధానాలను తాను విమర్శిస్తే, వారు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారని జనసేనాని ఎద్దేవా చేశారు. వేలకోట్లు దోచుకున్నానా, కులాల పేరుతో చిచ్చుపెట్టానా, కుటుంబపాలనలు చేశానా నేను ఏం తప్పు చేశానని విమర్శిస్తున్నారని పవన్ మండిపడ్డారు.

తన కష్టాలు వీళ్లకేం తెలుసునని ఆయన ప్రశ్నించారు. షూటింగ్ సమయాల్లో తన సెక్యూరిటీ కంటే కూడా ఆడపిల్ల భద్రత గురించే తాను ఆలోచిస్తానని పవన్ స్పష్టం చేశారు. మా అన్నయ్యకు, నా భార్యకి, బిడ్డలకు తన వల్ల ఎలాంటి సుఖం ఉండదని జనసేనాని అన్నారు.

తననెవరు సినిమాలకు బుక్ చేసుకునే వారు కాదని, కనీసం పోస్టర్లు వేసేవాళ్లు కాదన్నారు. నేను జనానికి బాగా కనెక్ట్ అయ్యానని, సొంతవాళ్లు వదిలేశారేమో కానీ అభిమానులు ఒక్కరు కూడా తనను విడిచిపెట్టలేదని పవన్ ఉద్వేగంతో అన్నారు.

ఎన్నో ఆశయాలతో తాను పార్టీ పెడితే.. అందరూ పల్లకీలు మోయడానికి తనను వాడుకున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పల్లకీలు తానెప్పుడూ కోరుకోలేదని, చిన్నపాటి గౌరవం కోరుకున్నట్లు తెలిపారు. అభివృద్ధి అనే పల్లకీలో మిమ్మల్ని కూర్చోబెడతారని తాను పల్లకీలు మోసినట్లు వెల్లడించారు.