హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై, సీఎం కేసీఆర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు మెగా కుటుంబంలో గుబులు రేపుతున్నాయి. 

తెలంగాణ రాష్ట్రం ఏమైనా పాకిస్థానా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చెయ్యడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా ఆంధ్రవాళ్లను కేసీఆర్ కొడుతున్నారని బలవంతంగా పార్టీలు మారిపిస్తున్నారని హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నవారిని ఇబ్బందులకు గురి చేసి వైసీపీలో చేరేలా ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.  

ఇప్పుడు ఆ వ్యాఖ్యలన్నీ తిరిగి పవన్ మెగా కుటుంబానికి సంకటంగా మారింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీకి తెలంగాణ రాష్ట్రానికి విడదీయరాని అనుబంధం ఉంది. అంతేకాదు ఆస్తులు సైతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. 

మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రాంతంలో ఎంతలా అభిమానులు ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలోనూ అంతేమంది అభిమానులు ఉన్నారు. సినీ రంగం అంతా హైదరాబాద్ లోనే ఉంది. మెగా కుటుంబం అంతా ఆధారపడింది హైదరాబాద్ పైనే. 

మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ తరం తర్వాతి వారంతా హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్లే. అలా హైదరాబాద్ లో కలిసిపోయారు మెగా ఫ్యామిలీ. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ పెళ్లి చేసుకున్న ఉపాసనది తెలంగాణ ప్రాంతం. 

అపోలో సి ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన.  కామినేని అనిల్, శోభన దంపతలు కుమార్తె. ఉపాసనకు సంబంధించి ఆస్తులు ఆంధ్రాలో కంటే తెలంగాణలోనే ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ కూడా తెలంగాణ అల్లుడే. 

టీఆర్ఎస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అల్లుడే అల్లుఅర్జున్. చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నారు అల్లు అర్జున్. అలా తెలంగాణ రాష్ట్రంతో వ్యాపారంగానే కాకుండా బంధుత్వం కూడా కలుపుకున్నారు మెగా ఫ్యామిలీ. 

ఇక చెప్పాలంటే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అత్యంత దగ్గరగా ఉంటారు మెగా ఫ్యామిలీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ కేటీఆర్ ని అన్న అనేంతగా సత్సమసంబంధాలు ఉన్నాయి. అంతేకాదు ఇటీవలే వినయవిధేయ రామ సినిమా  ప్రి రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్యఅతిథిగా కేటీఆర్ ను ఆహ్వానించారు చిత్ర యూనిట్. 

ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ లు గొప్ప నాయకులు అంటూ చిరంజీవి, రామ్ చరణ్ లు పొగడ్తలతో ముంచెత్తారు. అంతేకాదు రామ్ చరణ్, కేటీఆర్ లు అన్నదమ్ముల్లా ఉన్నారంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. 

అదే వేదిక సాక్షిగా పవన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సినీ ప్రస్థానంలో విజయవంతమైన పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూ రాజకీయాలు కొనసాగించాలంటూ కోరారు కూడా. 

ఇంతలా కేటీఆర్ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అభిమానులు అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతేకాదు రామ్ చరణ్ భార్య ఉపాసన రామ్ చరణ్ కు మంచి స్నేహితురాలు కూడా. ఇద్దరు వాట్సప్ లో టచ్ లో ఉంటారు. 

అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ పైనా తెలంగాణ ప్రభుత్వంపైనా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వారి మధ్య ఎలాంటి అగాధం పెడుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 

జగన్ ను ఇరుకున పెడదామని ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ తన మాటలతో మెగాఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవికి చిక్కులు తెచ్చేలా వ్యవహరించారు. పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీ దారుణంగా మాట్లాడుతుంది. 

సినీ ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ ఆయన అన్నలు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మెగా స్టార్ గా డబ్బులు సంపాదించిన ఆ కుటుంబం వారికి అన్నంపెట్టిన కళమ్మతల్లి కోసం ఏమైనా చేశారా అంటూ నిప్పులు చెరుగుతున్నారు. 

పవన్ వ్యాఖ్యల వల్ల తమకు ఏదైనా జరిగితే చిరంజీవి వచ్చి కాపాడతారా అంటూ తిట్టిపోస్తున్నారు. దీంతో మెగా కుటుంబం గందరగోళంలో పడిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కు ఓట్లు సంతగతి ఎలా ఉన్నా తెలంగాణలో మెగా కుటుంబానికి మాత్రం పెద్ద డ్యామేజ్ వచ్చిపడిందని ప్రచారం జరుగుతుంది. 

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసి కొందరు తెలంగాణలో మీకు మేం పెట్టిన ఇబ్బందులు ఏంటి అని కూడా సన్నిహితులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ వ్యాఖ్యల పట్ల చిరంజీవి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందని సమాచారం. దీంతో చిరంజీవి ఫ్యామిలీ పవన్ వ్యాఖ్యల డామేజ్ ని ఎలా సరిదిద్దుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.