హైదరాబాద్‌: ఎమ్మెల్యేగా గెలిపిస్తే భీమవరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్థిదిద్దుతానని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ భీమవరం నియోజకవర్గంతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 

తనను భీమవరం ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. రాజకీయం భావజాలంతో ముడిపడి ఉండాలి కానీ కులంతో కాదని తెలిపారు. తనకు కులం, మతం లేదని మానవత్వం మాత్రమే ఉందని తెలిపారు. అభివృద్ధిలో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. 

తాను రాజకీయాల్లోకి వచ్చింది జేజేలు కొట్టించుకోవడానికో, డబ్బు సంపాదించడానికో కాదని ప్రజల సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. దశాబ్దాలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలు భీమవరం కోసం పనిచేశారని వారు ఏం చేశారో తనకు తెలియదని కానీ తనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే భీమవరంని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 

విశ్వనగరంగా తయారు చేసే బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. తన కోసం కాదు మన బిడ్డల భవిష్యత్తు కోసం అడుగుతున్నానని తనకు ఓటెయ్యాలని కోరారు. నేను మీ సేవకుడిని. నేను మీ భుజాల మీద ఎక్కి నడిచే నాయకుడిని కాదన్నారు. 

ఇప్పటివరకు ఎన్నికైన ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించుకున్నారే తప్ప డంపింగ్‌ యార్డు తరలించలేకపోయారని విమర్శించారు. అటు తెలంగాణ వారు చూస్తే మీకేంటి.. పచ్చని గోదావరి జిల్లాలు అంటారని కానీ పచ్చదనంతో పాటు ఇక్కడ కాలుష్యం కూడా ఉందన్నారు.  

గోదావరి ఉన్నా బోర్లు వేస్తే వచ్చేది కాలుష్య జలాలేనని చెప్పుకొచ్చారు. ఇక్కడ పుట్టిన గిరిజనుల కోసం బ్రిటిషర్లకు ఎదురెళ్లిన అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో పనిచేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి చుక్కలు చూపించకపోతే అడగండంటూ సవాల్ విసిరారు. 

జనసేన పార్టీ స్థాపించినప్పుడు నా ఖాతాలో కోటి రూ.60 లక్షలు మాత్రమే ఉన్నాయని పార్టీ పెట్టడానికి భావజాలం కావాలి కానీ డబ్బు అవసరం లేదని భావించానని అందుకే ధైర్యంగా ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

ధైర్యం ఉన్న చోట లక్ష్మి ఉంటుందన్నారు. భీమవరం ప్రజల ప్రేమ మరువలేనని భీమవరం వాసులతో నాకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేశారు. నా ఇల్లు కట్టించింది భీమవరం వాసేనని వెల్లడించారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కోటి రూపాయలను పవన్‌ విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు.