అమరావతి: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ షర్మిలపై తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు మాటలదాడికి దిగుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని కౌంటర్ ఇవ్వగా మరో మహిళా నేత పంచుమర్తి అనురాధ నిప్పులు చెరిగారు. 

పసుపు, కుంకుమ పథకం గురించి షర్మిల ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పసుపుకుంకుమ పథకం కింద రాష్ట్రంలోని మహిళలకు పెద్దన్నగా చంద్రబాబు నాయుడు నిలిస్తే వైఎస్ జగన్ ఎన్నికల కోసం సొంత పిన్ని పసుపు కుంకుమను తుడ్చేసిన సంస్కృతి అంటూ ధ్వజమెత్తారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆమె రైతు రుణమాఫీ సాధ్యంకాదని షర్మిల అన్న అంటే రైతు రుణమాఫీ సుసాధ్యం చేసిన నేత చంద్రబాబు అంటూ కొనియాడారు. 

రుణమాఫీ చెక్కులు చెల్లవని అంటున్న షర్మిల అందుకు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పసుపు కుంకుమ కింద రూ.21 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్‌ 11కోసం మహిళలంతా ఎదురుచూస్తున్నారని స్పష్టం చేశారు. 

మీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మహిళలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ బినామీలు మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు నడిపించారంటూ ఎద్దేవా చేశారు. బీసీల మీద నీ కుటుంబానికి ఏ పాటి గౌరవముందో మీ తాత చేయించిన హత్యలే నిదర్శనమంటూ విమర్శించారు. 

ఆడ బిడ్డలకు పసుపు, కుంకుమ ఇవ్వడం చంద్రబాబు సంస్కారమని, సొంత పిన్ని పసుపు, కుంకుమను తుడ్చేసిన సంస్కృతి మీదని ఆమె విమర్శించారు. రెండు పార్టీలకు ఎంత తేడా ఉందో ఇంతకంటే వేరే చెప్పక్కర్లేదని పంచుమర్తి అనురాధ ఆరోపించారు.