కీచు గొంతు వేసుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధా వైసీపీ నేత వైఎస్ షర్మిలను హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో మంత్రి నారా లోకేష్ పై వైఎస్ షర్మిల, విజయమ్మ చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు. 

రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని నరేంద్రమోదీని ఎందుకు విమర్శించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ను దుర్భాషలాడుతూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని విమర్శించారు. 

కేటీఆర్ ఎంత ప్యాకేజీ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్ భయ్యారం గనులు నీకు కట్నం కింద ఇస్తే...ఇప్పుడు కేటీఆర్ ప్యాకేజీ ఇచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ విజయమ్మ, షర్మిలలను పోటీ చెయ్యడానికి పనికిరారని కేవలం ఎదుటి వారిపై బురదజల్లడానికే పనికి వస్తారని ధ్వజమెత్తారు. 

వైఎస్‌ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేక దళిత బాలికలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. రుణమాఫీ చేస్తామని రైతులను వైఎస్‌ మోసం చేస్తే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేశారని చెప్పుకొచ్చారు. 

పవర్‌హాలిడేల వల్ల 10లక్షల మంది రోడ్డునపడ్డారని గుర్తు చేశారు. చేనేతలను ఓటు అడిగే హక్కు వైఎస్ జగన్‌కు లేదన్నారు. ముక్కునేలకు రాసినా ఒక్క చేనేత ఓటు కూడా జగన్‌కు పడదన్నారు. చేనేతలను హత్య చేసిన వారి వెంట చేనేతలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. 

రూ.లక్ష కోట్లు కొట్టేసి జగన్‌ దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని పంచుమర్తి అనురాధా డిమాండ్ చేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి ప్రజల సొమ్ము దోచుకున్న వ్యక్తులు జగన్ ఫ్యామిలీ అంటూ విరుచుకుపడ్డారు. బీసీ ఫెడరేషన్ పేరుతో కార్పొరేషన్‌లను ఏర్పాటు చేసి నయా పైసా కూడా ఇవ్వని పరిస్థితి మీ రాక్షస రాజ్యంలో నెలకొందని అనురాధా విమర్శించారు.