ఎన్నికలకు ముందు టీడీపీ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరగా.. తాజాగా మరో సీనియర్ నేత పార్టీని వీడారు.  పశ్చిమగోదావరి జిల్లాకి చెందిన టీడీపీ సీనియర నేత, మాజీ ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తన పదవికి రాజీనామా చేశారు.

2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన సుబ్బారాయుడు... తర్వాత టీడీపీలో చేరారు.అయితే ఈ ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి నరసాపురం టికెట్ ను ఆశించారు. కానీ చంద్రబాబు ఆ టికెట్ ను మరొకరికి కేటాయించారు. టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన ఆయన మంగళవారం మధ్యాహ్నం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే అనుచరులు, కుటుంబీకులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని సుబ్బరాయుడు మీడియాకు తెలిపారు.
 
కాగా.. నరసాపురం నుంచి 2004లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచిన కొత్తపల్లి.. 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓటమిచెందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. అనంతరం టీడీపీ తీర్థం పుచ్చుకుని కార్పొరేషన్ పదవి దక్కించుకున్నారు.