అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం షాక్ ఇచ్చారు. సమీక్షా సమావేశాలు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ చంద్రబాబును ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎల్వీ సుబ్రహ్మణం ఐఎఎస్, ఐపిఎస్, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశానికి హాజరు కాకూడదని ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .చంద్రబాబు శాంతిభద్రతలపై సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లకూడదని ఆయన పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపి) ఆర్పీ ఠాకూర్ ను కూడా ఆదేశించారు. 

తన అనుమతి లేకుండా చంద్రబాబు నిర్వహించే సమావేశాలకు హాజరు కాకూడదని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై, అమరావతి రాజధాని నిర్మాణంపై గురువారంనాడు చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. 

శాంతిభద్రతల సమీక్షకు పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని చంద్రబాబు భావించారు. అయితే, దాన్ని రద్దు చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించకూడదని ఎల్బీ సుబ్రహ్మణ్యం భావిస్తున్నారు. 

ఏ పని మీద కూడా అధికారులు చంద్రబాబును కలవకూడదని కూడా ఆయన చెప్పారు. ఏదైనా విషయం ఉంటే చంద్రబాబు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉంటుందని, ఆ అధికారి ఆ విషయాన్ని తన దృష్టికి తెస్తారని ఆయన చెప్పారు. విషయాన్ని బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.