ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేనకు తీవ్ర పరాభవం ఎదురైంది. కనీసం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలవక పోవడం దారుణం. ఈ విషయాన్ని పక్కన పెడితే... కొన్ని ప్రాంతాల్లో జనసేన అభ్యర్థులకు పోలైన ఓట్ల కన్నా... నోటాకి ఎక్కువ ఓట్లు పడటం గమనార్హం.

చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, మదనపల్లె, తిరుపతిలో ఆ పార్టీ అభ్యర్థులు గట్టిగానే పోటీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం కనిపించలేదు. పుంగనూరులో 16452, మదనపల్లెలో 14601, తిరుపతిలో 12315 ఓట్లు పోలవగా.. ఆయా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కాయి. ఇక మిగతాచోట్ల ఎక్కడా జనసేన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. 

అంటే పోలైన ఓట్లలో కనీసం 6 శాతం ఓట్లు కూడా ఆయా అభ్యర్థులకు పడలేదు.కుప్పం, సత్యవేడు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా వచ్చాయి. సత్యవేడులో జనసేన, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థి విజయకుమార్‌కు 2076 ఓట్లు పోలవ్వగా.. నోటాకు అత్యధికంగా 3347 ఓట్లు పోలయ్యాయి. 

ఇదేవిధంగా కుప్పంలో జనసేన అభ్యర్థి వెంకటరమణకు 1879 ఓట్లు పోలవగా.. నోటాకు దానికంటే ఎక్కువగా 2905 ఓట్లు పడ్డాయి. ఇక పీలేరులో ఆ పార్టీ అభ్యర్థి దినేష్‌కు 2374 ఓట్లు పోలవ్వగా.. నోటాకూ కాస్త దగ్గరలో 2145 ఓట్లు పడ్డాయి. శ్రీకాళహస్తిలో పోటీచేసిన నగరం వినుత 5 వేల ఓట్లకు పైగా తెచ్చుకున్నా.. డిపాజిట్‌ను మాత్రం దక్కించుకోలేదు.