ఏపీలో ఎన్నికల ఫలితాలు ఏకపక్షమయ్యాయి. రాష్ట్రంలో ప్రజలంతా... జై జగన్ అంటూ తీర్పు ఇచ్చారు. ఇప్పటికే వైసీపీ నేతలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఒకవైపు వైసీపీ అధినేత జగన్ ని ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. మరోవైపు మాత్రం మాజీ ఎంపీ లగడపాటిని ఏకిపారేస్తున్నారు.

జాతీయ మీడియా సంస్థలన్నీ.. జగన్ దే గెలుపు అంటూ ప్రకటించినా... లగడపాటి మాత్రం చంద్రబాబుకే పట్టం కట్టారని తేల్చిచెప్పారు. చివరకు ఫలితాలు జగన్ కి అనుకూలంగా వచ్చాయి. సాధారణ విజయం కాదు... ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించారు. దీంతో... లగడపాటి తప్పుడు సర్వేపై నెటిజన్లు మండిపడుతున్నారు.

లగడపాటి సర్వేపై ఉన్న నమ్మకంతో చాలా మంది టీడీపీ గెలుపుపై బెట్టింగులు కాశారు. తీరా టీడీపీ కనీసం 30సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. అంతే... లగడపాటి సర్వేని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేవలం బెట్టింగు రాయుళ్లను మోసం చేసేందుకే తప్పుడు సర్వే ఇచ్చాడని కొందరు ఆరోపిస్తుంటే... చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకోవడానికే ఇలా చేశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు... సోషల్ మీడియా వేదిక రకరకాల ఫన్నీ మీమ్స్ తయారు చేసి... షేర్ చేస్తున్నారు. ఇక నేను సర్వేలు చేయను బాబోయ్ అని లగడపాటి అంటున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఇంకొందరేమో... రాజకీయ సన్యాసం మాదిరిగానే... లగడపాటి ఒక సర్వేల సన్యాసం కూడా తీసుకోవాలి అంటూ జోకులు పేలుస్తున్నారు.