నెల్లూరు నగరంలోని చిన్న బజారులో ఉన్న టీడీపీ కార్యాలయంలో నగదు పట్టుబడిన వ్యవహారం అక్కడ కలకలం రేపుతోంది. దీనిపై మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నెల్లూరు టీడీపీ అభ్యర్థి , మంత్రి నారాయణ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

మంత్రి నారాయణ డబ్బుతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ బలంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నారని అనిల్ ఆరోపించారు.

జిల్లాలో నారాయణ విద్యాసంస్థల సిబ్బంది నగదు పంపిణీలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.