తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. పవన్ మరీ ఇంత దిగజారిపోతారని తాను అనుకోలేదన్నారు.

అవును అభిమానిని కాబట్టే పక్క రాష్ట్రం చెన్నైలో ఉన్నా కూడా తన వంతుగా మీకు కటౌట్ కట్టించి అభిమానం చూపించాను.. అలాంటి తన మీద ఇలా మాట్లాడుతారా..? మీ అభిమానిగా ఉండాలంటే బెట్టింగులు మానేసి రమ్మని మీరు నాకు చెప్పారా..? అలా చెప్పినట్లు మీ దైవం ఆంజనేయస్వామి మీద ఒట్టేసే దమ్ముందా అని అనిల్ ట్వీట్ చేశారు.

మంగళవారం నెల్లూరు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్... అనిల్ కుమార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పలు ఇంటర్వ్యూల్లో అనిత్ తాను పవన్ కల్యాణ్ అభిమానిని అని చెప్పిన విషయం విదితమే.. అతను రెండు మూడు సార్లు నన్ను కలిశాడు..

నువ్వు బెట్టింగులు మానేసి.. నా అభిమానిని అని చెప్పు అని జనసేనాని వ్యాఖ్యానించారు. అదే అనిల్ తాను పవన్ అభిమానిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానని కూడా మీడియా, బహిరంగ వేదికల మీద చెప్పినట్లు పవన్ గుర్తు చేశారు.