హైదరాబాద్: మంగళగిరి నుండి వైసీపీ టిక్కెట్టు ఇస్తే లోకేష్‌పై పోటీ చేసి విజయం సాధిస్తానని జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు చెప్పారు.

గురువారం నాడు ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. తన నిర్ణయంతో  జూ.ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను చంద్రబాబును చాలా దగ్గర నుండి చూసినట్టుగా  ఆయన గుర్తు చేసుకొన్నారు.

చంద్రబాబుకు, జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని చెప్పారు. చంద్రబాబునాయుడు ఏపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఆయన గుర్తు చేశారు. ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చేశారని చెప్పారు. అందుకే తాను వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నానని ఆయన  చెప్పారు.

హైద్రాబాద్‌ను చంద్రబాబునాయుడు అభివృద్ధి చేయలేదన్నారు. హైద్రాబాద్ అభివృద్ధిలో చాలా మంది సీఎంల పాత్ర ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలనే నార్నే శ్రీనివాసరావు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

 గుంటూరు జిల్లా నుండి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే లోకేష్‌పై నార్నే శ్రీనివాసరావు పోటీ చేస్తానని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకొంది.