అమరావతి: ఎన్నికల తర్వాత కూడ ఏపీకి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగానే  ఉంటారని  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు. తాను టీడీపీ కార్యకర్తగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం నాడు ఆయన ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల తర్వాత తాను టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తానని ఆయన తెలిపారు. తాను ఏ పని చేయాలనే విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని ఆయన వివరించారు. 

ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన తెలిపారు. బాబు విజన్ రాష్ట్రానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబునాయుడు సేవలు అవసరమని ఆయన చెప్పారు.  పార్టీ ఎలా ఆదేశిస్తే ఆ పని చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. తెలంగాణతో ఏపీని పోల్చడం సరికాదన్నారు.

ప్రత్యేక హోదా విషయంలో తమను బీజేపీ మోసం చేసిందని లోకేష్ వివరించారు.  ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అమరావతిని ఎలా అభివృద్ధి చేశామో వచ్చి చూడాలని లోకేష్ విపక్షాలకు సూచించారు. గ్రాఫిక్స్‌లో అమరావతిని అభివృద్ధి చేస్తున్నట్టుగా చూపినట్టు ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు.

కేంద్రంలో మోడీ మరోసారి కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదని లోకేష్ చెప్పారు. మోడీ గుజరాత్‌కు మాత్రమే ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.మోడీ మరోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైతే ప్రత్యేక హోదాపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొంటే  అప్పుడు ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను జనసేనలో చేర్పించే  విషయంలో  టీడీపీ పాత్ర ఏముందని లోకేష్ ప్రశ్నించారు. సీబీఐలో లక్ష్మీనారాయణ పనిచేసిన సమయంలో జగన్‌పై కేసుల నమోదు విషయంలో తమ పార్టీకి ఎలాంటి సంబంధం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.టీడీపీలో చేరడం కంటే జనసేనలో చేరాలని లక్ష్మీనారాయణను పంపినట్టుగా వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

మా అభ్యర్థులను కేసీఆర్ బెదిరిస్తున్నారు: లోకేష్

టీడీపీ గెలుచుకోలేని సీటు కావాలన్నా, బాబు ఇచ్చేశాడు: లోకేష్