కర్నూల్: కర్నూల్ జిల్లా పర్యటన  సందర్భంగా పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యర్ధులను ప్రకటించారు. అయితే చివరకు ఆ ఇద్దరికి టీడీపీ జాబితాలో చోటు దక్కలేదు. ఒకరు ఏకంగా పార్టీని వీడిపోతే, మరోకరు భవిష్యత్తు కార్యాచరణపై కార్యకర్తలతో చర్చిస్తున్నారు.

గత ఏడాది కర్నూల్ జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్   పర్యటన సందర్భంగా కర్నూల్ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్‌లు పోటీలు పడి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో త్వరలో జరిగే ఎన్నికల్లో  కర్నూల్ ఎంపీ స్థానం నుండి బుట్టా రేణుక, కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి ఎస్వీ మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.ఆ సమయంలో అదే వేదికపై ఉన్న టీజీ వెంకటేష్ అలకబూనారు. వెంటనే ఆయన వేదికపైన మరో సీటులోకి మారారు. 

ఏప్రిల్ 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను చంద్రబాబునాయుడు ప్రకటించారు.

స్థానికంగా ఉన్న పరిస్థితులతో పాటు ఎన్నికల్లో ఏ అభ్యర్ధిని బరిలోకి దింపితే గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయనే విషయాలపై లోతుగా చర్చించి అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబునాయుడు.

కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని చివరి జాబితాలో ప్రకటించింది టీడీపీ. సర్వే రిపోర్టుల ప్రకారంగా టీజీ భరత్‌ మెరుగైన అభ్యర్ధిగా టీడీపీ నాయకత్వం భావించి ఆయనకు టిక్కెట్టు కేటాయించింది.  టీజీ భరత్‌కు టిక్కెట్టు కేటాయించడంతో ఎస్వీ మోహన్ రెడ్డి అలకబూనారు.

గురువారం నాడు కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరో వైపు తన భవిష్యత్తు కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే మాజీ  కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చంద్రబాబునాయుడు కర్నూల్ ఎంపీ టిక్కెట్టును కేటాయించారు.

సిట్టింగ్ ఎంపీ బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని బాబు హామా ఇచ్చాడు. కానీ, ఆమె అసంతృప్తితో వైసీపీలో చేరింది. వైసీపీ కూడ ఆమెకు ఎలాంటి టిక్కెట్టు కేటాయించలేదు.గత ఏడాది కర్నూల్ మీటింగ్‌లో లోకేష్ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులకు టీడీపీ టిక్కెట్లు దక్కలేదు. కొత్త అభ్యర్థులు రంగంలోకి వచ్చారు.