ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈవీఎంల పనితీరుపై ఇప్పుడు తప్పుబడుతున్న చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

అధికారులను బదిలీ చేస్తే బాబు ఎందుకు నానా యాగీ చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారని.. వారెవరికి రాని అనుమానం బాబుకు మాత్రమే ఎందుకు వచ్చిందన్నారు.

ఈ ఎన్నికల్లో టీడీపీ బాక్సులు గల్లంతు కావడం ఖాయమని నర్సింహారావు జోస్యం చెప్పారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత అలా ప్రవర్తించకూడదని హితవు పలికారు. చంద్రబాబులో హుందాతనం కనిపించకపోగా, చౌకబారుతనం కనిపించిందని జీవీఎల్ దుయ్యబట్టారు.