హైదరాబాద్: బెంగాల్ రాష్ట్రంలో జ్యోతిబసు మాదిరిగా ఏపీలో కూడ వైఎస్ జగన్ పాలన సాగిస్తాడని  సినీ నటుడు మోహన్ బాబు ఆకాంక్షను వ్యక్తం చేశారు.తాను ఏం సాధించాలని భావిస్తాడో దాన్ని సాధించేవరకు జగన్ సీఎంగా కొనసాగుతారన్నారు.

శుక్రవారం నాడు  సినీ నటుడు మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. జగన్ గెలుపు కోసం తన వంతు శక్తి వంచన లేకుండా కృషి చేసినట్టుగా ఆయన తెలిపారు.
వైఎస్ఆర్ గొప్ప నాయకుడని మోహన్ బాబు కొనియాడారు. వైఎస్ఆర్ కొడుకు జగన్‌ తమకు ఏదో ఒక మేలు చేస్తారని భావించి ప్రజలు ఆయనను గెలిపించారని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు.

వైసీపీకి అనూహ్య మెజారిటీ రావడం వెనుక జగన్ కృషి ఉందని మోహన్ బాబు చెప్పారు. రాష్ట్రంలో సుధీర్ఘంగా పాదయాత్ర నిర్వహించడం ఎవరి వల్ల సాధ్యం కాదని మోహన్ బాబు తెలిపారు. పాదయాత్రే జగన్‌ను గెలిపించిందన్నారు.

రాష్ట్రాన్ని జగన్‌ అద్భుతంగా పరిపాలన చేస్తారని మోహన్ బాబు తెలిపారు.  బెంగాల్ రాష్ట్రంలో జ్యోతి బసు మాదిరిగా ఏపీ రాష్ట్రంలో పాలన సాగిస్తాడని మోహన్ ఆకాంక్షను వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో  కులాల మధ్య పోటీ జరిగిందనే మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ప్రజలు అన్నీ విషయాలను తెలుసుకొని సముచిత నిర్ణయం తీసుకొన్నారని ఆయన తెలిపారు.ఐదోసారి ఒడిశా సీఎం‌గా ప్రమాణం చేస్తున్న నవీన్ పట్నాయక్‌కు,  ప్రధాని మోడీకి మోహన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు.