హైదరాబాద్: వైసీపీ నేత, సినీనటుడు మోహన్ బాబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీలో చేరేందుకు వైఎస్ జగన్ తనకు రూ.1200 కోట్లు ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. 

అంతకుముందు తాను ఏమీ ఆశించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. మాటతప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయితే ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రేట్ లీడర్ అని ఆయనకు తన మద్దతు ప్రకటించేందుకు వైసీపీలో చేరినట్లు తెలిపారు. 

తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పుకొచ్చారు. అయితే వైఎస్ జగన్ తో గంటపాటు చర్చించారని జగన్ ఏమైనా ఆఫర్ చేశారా అంటూ మీడియా మిత్రులు ప్రశ్నలు వేశారు. దాంతో మోహన్ బాబు వైఎస్ జగన్ రూ.1200 కోట్లు ఇస్తానన్నాడని అందుకే చేరానంటూ సెటైర్లు వేశారు. 

జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అని మాత్రమే పార్టీలో చేరానని తెలిపారు. వైసీపీలో చేరిన ఆయన తనకు పదవులపై వ్యామోహహం లేదన్నారు. మోహం ఉండుంటే 15 ఏళ్ల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే ఏదో ఒక పదవిలో ఉండేవాడినని అన్నారు.

తాను ఏమీ ఆశించకుండా పార్టీలో చేరానని చెప్తుంటే మళ్లీ ఏదో ఆశించానని ఎందుకు ప్రశ్నిస్తున్నారో అర్థంకావడం లేదంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిన దినాభివృద్ధి చెందుతున్నారని స్పష్టం చేశారు. ఆయన ఒక ప్రణాళిక ప్రకారం ఎన్నికలకు వెళ్తున్నారని ప్రచారం చెయ్యమని ఆదేశిస్తే రేపో ఎల్లుండో ప్రచారం చేస్తానని తెలిపారు.