కర్నూల్:కేంద్రం నుండి ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు.

కర్నూల్‌లో శుక్రవారం నాడు నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు.తన అసమర్ధతను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలకు కూడ చంద్రబాబునాయుడు రాష్ట్ర పథకాలుగా ప్రకటించుకొంటున్నారని ఆయన విమర్శించారు.

ఏప్రిల్ 11వ తేదీన బీజేపీకి ఓటేస్తే ఏపీ రాష్ట్రం ఉదయించే సూర్యూడిని చూస్తోందని ఆయన చెప్పారు. ఒకవేళ టీడీపీకి ఓటేస్తే పుత్రోదయం కోసం పనిచేసేవారికి ప్రయోజనం కలుగుతోందని ఆయన పరోక్షంగా టీడీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

దేశంలోని ఇదే తరహలో ఉన్న రాజకీయ పార్టీల నేతలను కలుపుకొని తనను ఓడించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
  యూటర్న్‌తో పాటు అబద్దాలను చెబుతున్నాడని చెప్పారు.

రాష్ట్రంలో దీర్థకాలంగా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సాగు నీటిని కల్పించడంలో ఆయన వైఫల్యం చెందారన్నారు. కృష్ణా, తుంగభద్ర లాంటి నదులు ఈ రాష్ట్రంలో ప్రవహిస్తున్న కూడ కనీసం తాగు నీరు కల్పించడంలో కాంగ్రెస్., టీడీపీలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపించారు.

పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని భావించి కేంద్ర ప్రభుత్వం రూ. 7 వేల కోట్లను ఇచ్చినా కూడ ఈ  ప్రాజెక్టు నత్తనడకన సాగుతోందని మోడీ విమర్శలు గుప్పించారు.ఏపీ రాష్ట్రానికి అనేక సంస్థలను ఇచ్చినట్టు మోడీ వివరించారు.   రాష్ట్రానికి ఇచ్చిన సంస్థల వివరాలను ఆయన ఈ సభలో గుర్తు చేశారు.దేశ ప్రధాన మంత్రి తొలిసారిగా కర్నూల్‌కు వచ్చినట్టు ఆయన తెలిపారు..రాయలసీమ ద్రోహులకు బుద్ది చెప్పాలని ఆయన కర్నూల్ జిల్లా ప్రజలను కోరారు.