కర్నూలు:  కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బతగిలింది. కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జగన్ బహిరంగ సభలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. 

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ కండువాకప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్  జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తాను వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు విధి విధానాలు నచ్చక తాను తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి అసలు ప్రజాదరణే లేదన్నారు. తన పట్ల చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన వాపోయారు. పార్టీలో కొంతమందికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారిని దూరం పెడుతున్నారని అందువల్లే తాను పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు. 

ఇక తెలుగుదేశం పార్టీలో ఉండలేక తిరిగి సొంతగూటికి చేరుకున్నట్లు ప్రకటించారు. ఇకపోతే మణిగాంధీ 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం నియోజకవర్గం అభివృద్ధి పేరుతో వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 

చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు గానూ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మణిగాంధీకి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వకుండా మెుండిచెయ్యి చూపారు. 

దీంతో ఆనాటి నుంచి పార్టీపై అలిగిన మణిగాంధీ శనివారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యడం కోసం తాను ప్రచారం చేస్తానని ఎమ్మెల్యే మణిగాంధీ స్పష్టం చేశారు.