అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదితో రాజంపేట వైసీపీ లోకసభ అభ్యర్థి మిథున్‌రెడ్డి రహస్య చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రుసరుసలాడుతున్న ద్వివేదితో మిథున్ రెడ్డి రహస్య మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది.

ద్వివేది, మిథున్ రెడ్డి దాదాపు గంటసేపు శనివారం సమావేశమయ్యారు. అయితే, ఆ చర్చల వివరాలేవీ బయటకు రాలేదు. వైసీపీకి చెందిన మరో నేత తలసిల రఘురామ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయానికి మిథున్‌రెడ్డి వచ్చారు. 

రఘురామ్‌ బయటే ఉండిపోయారు. మిథున్‌రెడ్డి ఒక్కరే సీఈవో గదిలోకి వెళ్లి గంట తర్వాత బయటకు వచ్చారు. మీడియా మాట్లాడకుండా కారెక్కి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచీ వైసీపీతోపాటు వివిధ పార్టీల నాయకులు సీఈవోను కలిశారు. ఆ భేటీల వివరాలను వెల్లడిస్తూ వచ్చారు.

ఫిర్యాదులు, వినతిపత్రాలు ద్వివేదికి అందజేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను మీడియాకు విడుదల చేసేవారు. సీఈవో ఆఫీసు నుంచి బయటకొచ్చిన  తర్వాత తాము ఎందుకు కలిశామనే విషయాన్ని చెప్పేవారు. అందుకు భిన్నంగా మిథున్‌రెడ్డి, సీఈవోల భేటీ సాగింది. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు, లోకసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్గ ముగిసిన విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరగుతుంది.