ఇటీవల ఏపీలో జరిగిన పోలింగ్ పలు అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈవీఎంలు సరిగా పనిచేయలేదని.. పోలింగ్ సరిదగా జరగలేదంటూ అధికార,  ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు.పోలింగ్ రోజున పలు చోట్ల ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి. కాగా.. ఇప్పుడు మరో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో దాదాపు 20మంది మైనర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు.

దీనికి సంబంధించి ప్రాథమిక నివేదికను ఇప్పటికే నియోజకవర్గాల ఎన్నికల అధికారిణి గంప జయదేవి ఆయనకు అందజేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ సాగుతుందని జయదేవి స్పష్టం చేశారు.

కాగా.. ఓటు వేసే వయసు  లేని వారికి అసలు ఎన్నికల అధికారులు ఓటు ఎలా ఇచ్చారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కావాలనే మైనర్లు ఓటు ఇచ్చి అవకతవకలకు పాల్పడ్డారని దీనిలో రాజకీయ పార్టీల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.