అమరావతి: ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చెయ్యనని మంత్రి శిద్ధా రాఘవరావు తేల్చి చెప్పేశారు. తనను కలవాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి శిద్ధారాఘరావుకు ఫోన్ చేశారు. 

అధినేత నుంచి పిలుపు  రావడంతో మంగళవారం సాయంత్రం శిద్ధా రాఘవరావు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయితే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి కాకుండా ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చెయ్యాలని కోరారు. 

పార్లమెంట్ అభ్యర్థిత్వంపై సుమారు అరగంటకు పైగా చర్చించారు. అయితే మంత్రి శిద్ధా మాత్రం ససేమిరా అనడంతో ఆలోచించి బుధవారం సాయంత్రం తనను కలవాలంటూ ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి శిద్ధా రాఘవరావు తాను ఎంపీగా పోటీ చేసే అంశంపై విముఖత వ్యక్తం చేశారు. 

తన నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకే పోటీ చెయ్యాలని కోరుతున్నారని పార్లమెంట్ కు వెళ్లొద్దంటున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్పష్టం చేశానని తెలిపారు. 

ఆ తర్వాత చంద్రబాబుదే తుది నిర్ణయం అంటూ వెళ్లిపోయారు మంత్రిగారూ. ఇకపోతే దర్శి అసెంబ్లీ టికెట్ మంత్రి శిద్ధారాఘవరావుకే కేటాయించారు చంద్రబాబు నాయుడు. అయితే మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు అనూహ్యంగా శిద్ధా రాఘవరావు పేరు తెరపైకి తెచ్చారు చంద్రబాబు నాయుడు.