ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారసుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన నారా లోకేశ్ ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. అయితే తాజాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గుంటూరు జిల్లా మంగళగిరి నుండి పోటీ చేయనున్నట్లు టిడిపి ప్రకటించింది. దీంతో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు లోకేశ్ ఇవాళ మంగళగిరిలో పర్యటించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్వయంగా నియోజకవర్గ ఇంచార్జిగా వ్యవహరిస్తున్న గంజి చిరంజీవి ఇంటికి వెళ్లారు. టిడిపి అదిష్టానం నిర్ణయం మేరకు ఇక్కడి నుండి తాను పోటీ చేస్తున్నానని...తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని ఆయన్ను కోరారు. అంతేకాకుండా మంగళగిరి గెలుపుకోసం తన వెంట నడవాలపి చిరంజీవి సూచించారు.  

అనంతరం అక్కడే వున్న స్థానిక నేతలతో కూడా లోకేశ్ ముచ్చటించారు. ప్రతి ఒక్కరు మన కార్యకర్తలను, గ్రామ స్థాయిలోని నాయకులను అప్రమత్తం చేసి మంగళగిరి స్థానంలో టిడిపి జెండా ఎగరవేయాలన్నారు. అలా తన గెలుసు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుని భవిష్యత్ లో మంచి అవకాశాలు కల్పిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు. 

లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం ఇదే.. అంటూ గత కొంతకాలంగా చాలా పేర్లు వినపడ్డాయి. ముఖ్యంగా విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు.. ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రచారం జరిగింది. అంతేకాకుండా కుప్పం, భీమిలీ, పెదకూరపాడు పేర్లు కూడా వినిపించాయి. చివరకు ఆయన టిడిపి అభ్యర్థిగా రాజధాని ప్రాంతంలోని మంగళగిరి నుండి పోటీ చేయనున్నట్లు ప్రకటించి ఈ ఊహాగానాలకు తెరదించారు.