అమరావతి: విశాఖజిల్లా పాయకరావుపేట టికెట్ నెలకొన్న సందిగ్ధతకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. పాయకరావుపేట టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఎదురవుతున్న అసమ్మతి దృష్ట్యా ఆమెకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు నిరాకరించారు. 

పాయకరావుపేటలో అనితకు తీవ్ర అసంతృప్తి ఉన్న నేపథ్యంలో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించినప్పటి నుంచి పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతి బయటపడింది. ఆ అసమ్మతి కాస్త ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు చేరింది. 

దీంతో పాయకరావుపేట నియోజకవర్గం అభ్యర్థిత్వంపై చంద్రబాబు తీవ్ర కసరత్తు చేశారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అనితకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు. పాయకరావుపేట టికెట్ ను టీడీపీ సీనియర్ నేత బంగారయ్యకు ఖారారు చేశారు. 

అయితే వంగలపూడి అనితను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థిగా ప్రకటించారు. వంగలపూడి అనిత రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కొవ్వూరులో అసమ్మతి ఎదుర్కొంటున్న మంత్రి జవహర్ కు కూడా చంద్రబాబు నాయుడు ట్విస్ట్ ఇచ్చారు. 

మంత్రి జవహర్ కు టికెట్ ఇవ్వొద్దంటూ గత కొంతకాలంగా నియోజకవర్గంలో తీవ్ర అసంతృప్తి చెలరేగుతోంది. ఏకంగా కొవ్వూరు నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా మరో టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. 

అంతేకాదు చంద్రబాబు నాయుడు నివాసం వద్ద మంత్రి జవహర్ కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జవహర్ కు టికెట్ కేటాయించడం సబబు కాదని భావించిన చంద్రబాబు నియోజకవర్గాన్ని మార్చారు. సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా కృష్ణాజిల్లాలోని తిరువూరు నియోజకవర్గం కేటాయించారు. తిరువూరు నుంచి రాబోయే ఎన్నికల్లో మంత్రి జవహర్ పోటీ చెయ్యనున్నట్లు తెలుస్తోంది.