ఎన్నికల సందర్భంగా బీజేపీ, వైసీపీ కలిసి ఎన్నో కుట్రలకు పాల్పడ్డాయన్నారు మంత్రి దేవినేని ఉమా. విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు తెలుగుదేశం వైపే ఉన్నారని స్పష్టం చేశారు.

ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది దేవుడు నిర్ణయిస్తారన్న జగన్ పరోక్షంగా ఓటమిని అంగీకరించారని ఉమా ఎద్దేవా చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టడానికి వైఎస్ జగన్ రూ.300 కోట్లను ఖర్చు పెట్టారని ఆయన ఆరోపించారు.

తునిలో రైలు తగలపెట్టడం, కులాలు, మతాలను రెచ్చగొట్టి బీహార్ తరహా వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రశాంత్ కిశోర్ ఎన్నో కుట్రలు చేశారని దుయ్యబట్టారు. తన చివరి కన్సల్టేషన్ ఫీజు కోసం గెలిచేస్తున్నారంటూ వైఎస్ జగన్‌ను పీకే భ్రమల్లో విహరింపజేస్తున్నారని ఉమా ధ్వజమెత్తారు.

పోలింగ్ రోజు కూడా ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించి, బస్సులు ఆపినా వివిధ రాష్ట్రాల్లో స్ధిరపడిన ఆంధ్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. గ్రామాల్లో ప్రజలను వైసీపీ రెచ్చగొడుతోందని ఉమా ఆరోపించారు.