ఏపీలో వెయ్యి శాతం గెలుపు తమదేనని మంత్రి దేవినేని ఉమా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 23 తేదీన ఫలితాలు వెలువడిన తర్వాత తాము సంబరాలు చేసుకుంటాని ఆయన చెప్పారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ చూసుకుని తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని భ్రమరావతి అన్న జగన్‌ ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు ఏం చూసి ప్రజలు ఓటేస్తారని అన్నారు. 2014లో రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకి ఓటేసి గెలిపించారని, చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే భావంతోనే ఆయనను సీఎం చేశారని దేవినేని అన్నారు. 

2019లో కూడా టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు అనే బాధ్యతతో ప్రజలు ఓటేశారని, రాష్ట్రంలో 62 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని దేవినేని ఉమ తెలిపారు. ప్రజలు తమ ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ లో నిజం లేదని తేల్చిచెప్పారు. 

40 రోజుల్లో అభ్యర్థులతో మాట్లాడే సాహసం కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదని విమర్శించారు. పోలవరం పనులను చకచకా పూర్తి చేస్తుంటే కేవీపీ రామచంద్రరావు డబ్బా కొట్టుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. అరాచకశక్తులు రాజ్యాధికారం కాంక్షిస్తున్నాయని ఆరోపించారు.

 ఏ ఫర్‌ అమరావతి..పీ ఫర్‌ పోలవరం అని ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌ ఇచ్చిన రూ.1200 కోట్లకి కక్కుర్తి పడి రాయలసీమ ద్రోహిగా మారారని విమర్శించారు. ప్రశాంత్‌ కిషోర్‌ బిహార్‌ ముఠా అని..ఫలితాలు వచ్చాక కుట్రలు బయటకు వస్తాయన్నారు. 

 ప్రశాంత్‌ కిషోర్‌, జగన్‌, విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమది మహిళా ప్రభంజనం అని దేవినేని ఉమ అన్నారు.