హైదరాబాద్: జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్‌కు  మద్దతుగా మెగా ఫ్యామిలీకి చెందిన సినీ నటులు ప్రచారం చేస్తారా లేదా అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన నటులెవరూ కూడ జనసేనకు మద్దతుగా ప్రచారం చేసే అవకాశాలు లేకపోవచ్చనే ప్రచారం  సాగుతోంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో యువరాజ్యం పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో వీలీనమైంది. దీంతో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి కూడ దక్కింది.

ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రజా రాజ్యం తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించాడు. ఇదిలా ఉంటే  2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేనను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతిచ్చాడు.

ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పోటీ చేస్తోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు జనసేనలో చేరాడు. నర్సాపురం ఎంపీ స్థానం నుండి నాగబాబు జనసేన అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు.  మెగా బ్రదర్స్ ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

అయితే వీరిద్దరి ప్రచారంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎవరూ కూడ క్యాంపెయిన్‌లో పాల్గొనడం లేదు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఓ సినిమా షూటింగ్  ‌లో పాల్గొంటున్నందున ప్రచారంలో ఆయన పాల్గొనే అవకాశం లేదని సమాచారం.  మెగా స్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. దీంతో ఆయన కూడ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండదని అంటున్నారు.

ఇదిలా ఉంటే  చివర్లో మెగా హీరో రామ్ చరణ్ జనసేన తరపున తరపున ప్రచారం చేస్తారనే ప్రచారం కూడ సాగుతోంది. అయితే ఈ విషయాలపై మెగా ఫ్యామిలీ నుండి స్పష్టత రావాల్సి ఉంది. .జనసేన తరపున ప్రచారం చేస్తారా,  ప్రచారానికి దూరంగా ఉంటారా అనే విషయమై మెగా ఫ్యామిలీ హీరోలు ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.