హైదరాబాద్: ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఆయా పార్టీలు బిజీబిజీ అయిపోయాయి. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, మేనిఫెస్టో పార్టీ విధి విధానాలపై తీవ్ర కసరత్తు ప్రారంభిస్తున్నాయి. 

ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన పార్టీలు ఎన్నికల ప్రచారం షెడ్యూల్ కూడా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కాస్త ముందే ఉన్నారని చెప్పుకోవాలి. మార్చి 16 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ జగన్. 

తన తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిళలను సైతం ఎన్నికల ప్రచారంలోకి దించనున్నారు. అదేరోజు అభ్యర్థులను కూడా ప్రకటించనున్నారు వైఎస్ జగన్. అంతేకాదు నామినేషన్ దాఖలకు ముహూర్తం కూడా చూసుకున్నారు వైఎస్ జగన్. మార్చి 22న వైఎస్ జగన్ పులివెందులలో నామినేషన్ వెయ్యనున్నట్లు తెలుస్తోంది.