ఏపీ డీజీపీని తప్పించాలంటూ ఎన్నికల ప్రధానాధికారికి వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు పూర్తయయ్యే వరకు డీజీపీని తప్పించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఏపీ డీజీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆర్కే ఆరోపించారు. ఠాకూర్ డీజీపీగా కొనసాగితే ఓటర్లు సజావుగా తమ హక్కును వినియోగించుకోలేరని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

నారాలోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేయడం కన్ఫామ్ కావడంతో అక్కడ టీడీపీ దూకుడు పెంచింది. తాడేపల్లిలో వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై పోలీసులు బైండోవర్ కేసులు పెట్టడంతో ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు, విద్యార్థులపై కేసులు పెట్టి వారిని వేధింపులకు గురి చేస్తున్నారని ఆళ్ల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక్క తాడేపల్లిలోనే 260 మందిపై కేసులు పెట్టారన్నారు.

బాధితులతో కలిసి తాడేపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మంత్రి నారాలోకేశ్ ఆదేశాలతోనే వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.