ఎన్నికలకు ముందు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా నేత కాండ్రు కమల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళగిరి టికెట్ కోసం గంజి చిరంజీవి, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పోటీ పడ్డారు.

టికెట్ ఆశించిన స్థానిక నేతలను కాదని మంత్రి నారా లోకేశ్‌కు చంద్రబాబు టికెట్ కేటాయించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. టికెట్ ఖరారైన తర్వాత అసంతృప్తిని బయటకు చెప్పకపోయినప్పటికీ అధిష్టానంపై వారు ఆగ్రహంగానే ఉన్నారు.

ఈ క్రమంలో ఎన్నికల్లో తనకు సహరించాల్సిందిగా నారా లోకేశ్ స్వయంగా స్థానిక నేతల ఇళ్లకు వెళ్లి అభ్యర్థించారు. వారంతా టీడీపీకి అండగా ఉంటామని చెప్పారు. అయితే వీరిలో కాండ్రు కమల మాత్రం అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు.

ఈ క్రమంలో ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.  గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో కమల వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె పీఆర్‌పీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని 13 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కమల .. ఎన్నికలకు కొద్దినెలల ముందు టీడీపీలో చేరారు.