చిత్తూరు: చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో దేశాయ్ తిప్పారెడ్డికి టికెట్ ఇవ్వరంటూ వస్తున్న వార్తలపై మనస్థాపంతో ఆయన పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. 

దేశాయ్ తిప్పారెడ్డి స్థానంలో మైనారిటీ నేతలను బరిలోకి దించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దేశాయ్ తిప్పారెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకు జరుగుతున్న పరిణామాలు, మైనార్టీలకు టికెట్ ఇవ్వాలన్న పార్టీ ప్రతిపాదనపై చర్చించారు.  అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తాను వైసీపీలో ఉండాలని భావించడం లేదని చెప్పుకొచ్చారు. 

అధినేత జగన్ నిర్ణయం మనస్థాపానికి గురి చేసిందని చెప్పుకొచ్చారు. రాజంపేట పార్లమెంటు సీటు గెలవాలంటే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మెజారిటీ రావాలని కడప జిల్లా కోడూరు, చిత్తూరు జిల్లా పీలేరులో టీడీపీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. 

రాజంపేట, తంబళ్లపల్లెల్లో వైసీపీ, టీడీపీలమధ్య పోటాపోటీగా ఉంటుందని రాయచోటి, పుంగనూరుల్లో వైసీపీకే ఆధిక్యం ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల వారీగా బేరీజు వేసుకుంటే మదనపల్లి నియోజకవర్గం ఆధిక్యంతోనే రాజంపేట పార్లమెంట్ గెలవగలరని ఆ మెజారిటీ ఒక్క తిప్పారెడ్డితోనే సాధ్యమన్నారు. 

ఆత్మీయ సదస్సులో కార్యకర్తలంతా పార్టీ వీడాలని ఒత్తిడితెస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల స్పందన చూశాక తన రాజకీయ భవిష్యత్ తన చేతుల్లో లేదని అర్థమైందన్నారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయమన్నారు. టికెట్ విషయంలో పునరాలోచన చెయ్యకపోతే పార్టీ వీడతానని తనకు రెడ్ కార్పెట్ పరిచే పార్టీలో చేరతానంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి.