కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన దివంగత కొనేరు రంగారావు కాంగ్రెస్‌‌లో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న అదృష్టం మరో నేతకు లేదంటారు కృష్ణాజిల్లా వాసులు.

ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటి చేసినా ఖచ్చితంగా మంత్రి పదవిని చేపట్టేవారు. విజయవాడ సమీపంలోని  గూడవల్లి గ్రామ సర్పంచిగా 20 ఏళ్లు పని చేసిన ఆయన కాంగ్రెస్ దృష్టిలో పడ్డారు.

1978లో నాటి కంకిపాడు నియోజవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన రంగారావు.. జనతా పార్టీ అభ్యర్థి తుమ్మల చౌదరిపై విజయం సాధించారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థనరెడ్డి కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరించారు.

ఆ తర్వాత తిరువూరు నుంచి వరుసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది వైఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండు సార్లు ఆయన కేబినెట్‌లో స్థానం పొందడమే కాకుండా ఏకంగా ఉప ముఖ్యమంత్రిగా ఛాన్స్ కొట్టేశారు.

వైఎస్ మరణం తర్వాత రోశయ్య  మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి, మున్సిపల్, రోడ్లు-భవనాలు, హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించచారు. ఎమ్మెల్యే అయిన ప్రతీసారి మంత్రి అవ్వడంతో పాటు ఆయన గెలిచిన ప్రతిసారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం మరో విశేషం.