నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరోషాక్ తగలనుంది. టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆ పార్టీకి రాజీనామా చెయ్యనున్నట్లు తెలుస్తోంది. 

నరసాపురం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ కొత్తపల్లి సుబ్బారాయుడు ఇటీవలే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకే టికెట్ కేటాయించడంతో అలిగిన ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 

అయితే గురువారం అనుచరులతో సమావేశమైన కొత్తపల్లి రాబోయే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చెయ్యాలని కార్యకర్తలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కొత్తపల్లి సుబ్బారాయుడు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరికాసేపట్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యనున్నట్లు సమాచారం.