విజయనగరం : విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడు సోదరుడు కొండపల్లి కొండలరావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 

గజపతినగరం నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ కొండలరావు తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. నియోజకవర్గం నేతలంతా సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా టీడీపీ ఆయనకే టికెట్ కేటాయించడంతో అలకబూనిన ఆయన తన అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమక్షంలో వైసీపీలో చేరతానంటూ ప్రకటించారు. 37ఏళ్లుగా టీడీపీలో పని చేస్తున్న తనకు సరైన గుర్తింపు రాలేదని వాపోయారు. 

తన తండ్రి మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీని జిల్లాలో గెలుపించుకుంటూ వచ్చామని తెలిపారు. 2014లో మా తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకు మంచి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. 

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కేఏ నాయుడుకి మరలా టికెట్ ఇవ్వొద్దని సూచించినా పార్టీ టికెట్ కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ పతనానికి నాంది పలికిందన్నారు. 

ఆయన అభ్యర్థిత్వాన్ని అనేక సర్వేలు, కేడర్ వ్యతిరేకించినా అధిష్టానం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. మూడు దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తించలేదని కనీసం పిలిచి మాట్లాడలేదని వాపోయారు. దీంతో తాను టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.