ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఘోర పరాభవాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్‌సిపి ప్రభంజనం ముందు టిడిపి పార్టీ హేమీహేమీలు సైతం నిలవలేకపోయారు.  ఇక నారావారి కుటుంబానికయితే ఈ ఎన్నికలు ఓ పీడకలే అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా సీఎం తనయుడు, మంత్రి నారా లోకేశ్ మంగళగిరిలో ఓటమిపాలవడంతో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఇక ప్రత్యక్ష ఎన్నికలతో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరికి ఎలాంటి సంబంధం లేకపోయినా పరోక్షంగా ఆమె ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. 

గతంలో నారా భవనేశ్వరి తన అమ్మమ్మగారి వూరయిన కృష్ణా జిల్లాలోని కొమరవోలు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇది మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య బసవతారకం పుట్టిన వూరు కావడంతో స్వతహాగా ఇక్కడ టిడిపి హవా వుండేది. ప్రతి ఎన్నికల్లోనూ  టిడిపి హహనే కొనసాగేది. పైగా ఈసారి భువనేశ్వరి ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు కాబట్టి మరింత ఎక్కువ మెజారిటీ వస్తుందని అందరు భావించారు. కానీ అందుకు భిన్నంగా గ్రామస్తులు విచిత్రమైన  తీర్పునిచ్చారు. 

ఈ గ్రామంలో మొత్తం 1,474 ఓట్లు పోలవగా అందులో వైఎస్సార్‌సిపికి 843ఓట్లు వచ్చాయి. ఇక టిడిపికి కేవలం 548 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇలా టిడిపి అగ్ర నాయకులతో సంబంధమున్న ఈ గ్రామంలో వైఎస్సార్‌సిపికి 295 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇలా పామర్రు నియోజకవర్గ అభ్యర్థి కైలే అనిల్‌కుమార్‌ వైపే కొమరవోలు ప్రజలు నిలిచారు.