అమరావతి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  పోటీలో చేయాలని భావిస్తున్న ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు అసమ్మతి తలనొప్పిగా మారింది.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టీడీపీ అభ్యర్ధిగా కోడెల శివప్రసాదరావు పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి  మరోసారి కోడెల శివప్రసాదరావు పోటీ చేస్తానని గురువారం నాడు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు.

నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, కోడెల శివప్రసాదరావులు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కోడెల శివప్రసాదరావు కూడ బాబుతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత సత్తెనపల్లి నుండి పోటీకే కోడెల శివప్రసాదరావు మొగ్గు చూపారు. సత్తెనపల్లి  అసెంబ్లీ నియోజకవర్గంలో కోడెల శివప్రసాదరావు స్వంత మండలం ఉంది. దీంతో సత్తెనపల్లి నుండి మరోసారి పోటీకి ఆయన మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు.

అయితే సత్తెనపల్లి నుండి కోడెల శివప్రసాదరావు పోటీ చేయడాన్ని కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. కోడెలకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు  నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  కోడెల శివప్రసాదరావు కాకుండా మరోకరికి ఈ స్థానంలో టిక్కెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అయితే ఈ అసమ్మతిపై కూడ కోడెల శివప్రసాదరావు స్పందించారు. పార్టీలో నెలకొన్న  చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకొంటానని తేల్చి చెప్పారు.