గుడివాడ: తెలుగుదేశం పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తనను ఓడించాలని టీడీపీ టార్గెట్ చేసిందని వారి టార్గెట్ నెరవేరదన్నారు. తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

స్థానిక నేతలపై టీడీపీ అధిష్టానానికి నమ్మకం లేకే స్థానికేతరుడిని తనపై పోటీకి నిలబెడుతున్నారంటూ విమర్శించారు. తనను ఓడించేందుకు టీడీపీ అంగ, అర్ధబలాలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. 

ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా గుడివాడలో తన గెలుపును అడ్డుకోలేరని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ ను ప్రకటించారు చంద్రబాబు. 

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన రావి వెంకటేశ్వరరావుకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీంతో రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్, వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని తలపడనున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గుడివాడలో కొడాలి నాని గెలుపును అడ్డుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు మాంచి కసితో రగిలిపోతున్నారు.