కావలి: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా కావలి నియోజకవర్గం టీడీపీ సీనియర్‌ నేత కావ్యకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. 

బుధవారం తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన కావ్య కృష్ణారెడ్డి తాను టీడీపీ వీడుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో తనకు తీవ్ర అవమానాలు  జరిగాయని కానీ వాటిని తాను ఏనాడు బయటపెట్టలేదన్నారు. 

గురువారం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ప్రకటించారు. ఉదయగిరి వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డిల విజయానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

అలాగే కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గెలిపించి తీరుతానని తెలిపారు. కేవలం ఆరు రోజులు మాత్రమే ఉండడంతో ఉదయగిరి, కావలి నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో, వార్డుల్లో తన ఆత్మీయులు స్వచ్ఛందంగా వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 

ఇటీవల తన తండ్రి మరణించినందున తాను ప్రతి ఇంటికి రాలేకపోతున్నానని, కానీ ప్రతి గ్రామం, వార్డులకు వచ్చి వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని తెలిపారు. తన సొంత మండలమైన జలదంకిలో ఆదాల, మేకపాటిలకు భారీ మెజారిటీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అయితే కావ్య కృష్ణారెడ్డి వైసీపీలో చేరడానికి రాజ్యసభ సభ్యుడు వైసీపీ కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పారని ప్రచారం.