భీమవరం: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చెయ్యాలని భావించిన ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్లారు. 

అయితే నామినేషన్ దాఖలు చేసే సమయం మించిపోవడంతో నామినేషన్ ను తీసుకోకుండా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. నరసాపురం అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యాలని తొలుత పాల్ భావించారు. 

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనపై పోటీ చెయ్యనున్నట్లు ప్రకటించారు. అయితే భీమవరం రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 3.30 గంటలకు చేరుకున్నారు. 

నామినేషన్ పత్రాలు అన్ని పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించే సరికి సమయం అయిపోవడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను తిరస్కరించారు. నామినేషన్లు తీసుకునేందుకు 4గంటల లోపు రావాలని అయితే 4.10గంటలకు రావడంతో తీసుకోలేదని స్పష్టం చేసినట్లు కేఏ పాల్ తెలిపారు. 

తన నామినేషన్ తీసుకోకపోవడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు కేఏ పాల్. అటు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కూడా కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కొన్ని పత్రాలు సమర్పించకుండా నామినేషన్ వేశారు. 

అయితే కావాల్సిన పత్రాలు సమర్పించాలని రిటర్నింగ్ అధికారి ఆదేశించడంతో కేఏ పాల్ బంధువుల ద్వారా ఆ పత్రాలు పంపారని తెలుస్తోంది. నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వేసిన నామినేషన్ పత్రంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.